జగదేవ్పూర్, 2026-11-22
సిద్దిపేట జిల్లా జంగం రెడ్డిపల్లి సమీపంలో కొలువైన శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయం, కార్తీక పూర్ణిమ సందర్భంగా జరిగే రామునిబండ జాతరకు సిద్ధమైంది.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని జంగం రెడ్డిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయం కార్తీక పూర్ణిమ సందర్భంగా జరిగే రామునిబండ జాతరకు ముస్తాబైంది. ఈ ప్రాంత ప్రజలకు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, భక్తులకు అభయమిచ్చే దైవంగా శ్రీ కోదండ రామచంద్రస్వామి ప్రసిద్ధి చెందారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్థానికుల కథనం ప్రకారం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇక్కడి బండపై గుండం ఏర్పాటు చేసుకుని సేదతీరారని చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం రామునిబండగా ప్రసిద్ధి చెందిందని స్థానికుల విశ్వాసం. గతంలో గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లేందుకు ప్రజలు భయపడేవారని, జాతర సమయంలోనే అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించేవారని గ్రామ పెద్దలు తెలిపారు. రామునిబండ జాతరలో స్వామివారి పుష్కరిణికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు స్వామివారి సన్నిధిలో రాత్రి నిద్రించి, ఉదయం పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పుష్కరిణి నీటిని ఇంటికి తీసుకెళ్లి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భక్తితో తాగించినట్లయితే స్వామివారి కృపతో ఆరోగ్యం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని మొక్కుకుని, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జాతరలో పాల్గొనడం ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం.
కాలక్రమేణా ఆలయం అభివృద్ధి చెందుతూ, గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం భక్తుల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ, వారి విశ్వాసానికి ప్రతీకగా శ్రీ కోదండ రామచంద్రస్వామి నిలుస్తున్నారని భక్తులు పేర్కొన్నారు. కార్తీక పూర్ణిమకు ముందు రోజు నుంచి పూర్ణిమ అనంతరం నాలుగు రోజుల పాటు రామునిబండ జాతర నిర్వహించబడుతుంది. ఆలయ పరిసరాల్లో, గ్రామంలో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకు ఈ ప్రాంత ప్రజలు, సుదూర ప్రాంతాలలో స్థిర నివాసం ఉన్నవారు తమ బంధువులతో కలిసి స్వగ్రామానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జంగం రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అశోక్, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోరిన వారికి కొంగుబంగారమై, భక్తులకు అభయమిచ్చే శ్రీ కోదండ రామచంద్రస్వామి కొలువైన రామునిబండ జాతర ఈ ప్రాంతంలో విశేష ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక ఉత్సవంగా కొనసాగుతోంది.







