మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓ ట్రాన్స్జెండర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని రాంపల్లి దయారా సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు అండర్పాస్ కింద మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని బోగారం ప్రాంతానికి చెందిన శేఖర్ అలియాస్ స్వీటీ (35)గా పోలీసులు గుర్తించారు.
శేఖర్ అక్టోబర్ చివరి వారంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో తండ్రి కీసర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
మృతదేహం లభించిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఆత్మహత్య అయి ఉండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ, మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











