హైదరాబాద్, August 1, 2024
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఐదు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మరణించారు. ఆయన మరణవార్తను యశోద ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో ఐదు రోజులుగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
జూలై 26వ తేదీన ఉదయం హనుమకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన పట్టణంలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వైద్యులు దాదాపు తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి, ఆగిపోయిన గుండెకు లయ తెప్పించారు. అయినప్పటికీ స్పృహలోకి రాకపోవడం, పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
గత ఆదివారం పెద్ది అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హుటాహుటిన బయల్దేరి హనుమకొండకు వెళ్లారు. అక్కడ వైద్యులతో మాట్లాడి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానల్ ద్వారా స్వయంగా హైదరాబాద్‌కు తరలించారు. హనుమకొండ ఆస్పత్రి నుంచి యశోద ఆస్పత్రికి తీసుకొచ్చే వరకు, అక్కడ అందుతున్న వైద్య సేవలను వారే స్వయంగా పర్యవేక్షించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆస్పత్రికి వచ్చి పరామర్శించి, పెద్దిని కాపాడాలని వైద్యులను కోరారు. పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, డాక్టర్ల కృషి విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాధనకు అండగా నిలిచిన ఆదర్శ నాయకుడైన సుదర్శన్ రెడ్డి, 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్ఎస్ జిల్లా పార్టీ కన్వీనర్‌గా, ఆ తర్వాత 2002లో రాష్ట్ర పార్టీ కన్వీనర్‌గా నామినేట్ అయ్యారు. ఆయన ఎనిమిదేళ్లకు పైగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆ తర్వాత పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నామినేట్ అయ్యారు.









