Hanamkonda, 2026-11-22
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. శాయంపేట మండల కేంద్రానికి చెందిన అత్యంత పేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన విద్యార్థిని మామిడి కళ్యాణి ఉన్నత విద్యాభ్యాసం కోసం సంఘం ప్రతినిధులు రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు.
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన మామిడి కళ్యాణి ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ - బీఎస్సీ) చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో ఆమె చదువుకు ఆర్థిక తోడ్పాటు అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం బాధ్యులు స్పందించి, ఆమె విద్యా అవసరాల నిమిత్తం రూ. 15 వేల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమాజంలోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని, కళ్యాణి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తమ కష్టకాలంలో ఆదుకున్న పద్మశాలి ఉద్యోగుల సంఘం సభ్యులకు కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వేజ్ బోర్డ్ మెంబర్ బాసాని చంద్రప్రకాష్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సహకార పరపతి సంఘాల సమాఖ్య కన్వీనర్ వేముల సదానందం, కో కన్వీనర్లు గుండు కామేశ్వర్, కొండబత్తుల రాజమౌళి, గుత్తికొండ రాజమౌళి, యెలగం నర్సయ్య, పాశికంటి చంద్ర శేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం నాయకులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.







