22 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
సిద్దిపేట పట్టణంలోని ఎల్లమ్మగుడి ప్రాంతంలో వేణు యాదవ్, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దున్నరాజుల విన్యాసాలను తిలకించి, యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణంలోని ఎల్లమ్మగుడి ప్రాంతంలో వేణు యాదవ్, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దున్నరాజుల విన్యాసాలను తిలకించి, యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు సదర్ ఉత్సవాలు చూడాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేదని, నేడు సిద్దిపేటలోనే వరుసగా నాలుగో సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుష్పాలు, పక్షులు, పశువులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని పేర్కొన్నారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవుల అభివృద్ధికి గొర్రెల పంపిణీ, పాల లీటరుకు రూ.4 ప్రోత్సాహకం, బీసీ గురుకులాలు, విదేశీ విద్యకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. యాదవ కుటుంబాలు తమ పిల్లలను, ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. సదర్ ఉత్సవాలు యాదవుల ఐక్యతకు, పశుసంపద ప్రాధాన్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వేణు యాదవ్, రఘు యాదవ్, కిట్టు యాదవ్, నూకల బ్రదర్స్, బర్ల మల్లికార్జున్, పోచరబోయిన శ్రీహరి యాదవ్, మామిండ్ల ఐలయ్య యాదవ్, తదితరులను అభినందించారు.







