గ్రామాల అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా అన్ని వర్గాలతో కలిసి పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలంలోని బొంత గట్టు నాగారం, బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్త తండా, అంకుశాపూర్ గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా గ్రామాభివృద్ధి కోసం ముందుకు వస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గ్రామంలో విభేదాలకు తావులేకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని సూచించారు. స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, సీనియర్ నాయకులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలంతా సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నీటి సమస్య పరిష్కారంపై హామీ
తరిగొప్పుల ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల చుట్టుపక్కల నర్మెట్ట, జనగామ, బచ్చన్నపేట ప్రాంతాలకు నీరు అందుతున్నప్పటికీ, తరిగొప్పుల పరిధిలోని 14 లేదా 15 గ్రామాలు, తండాల్లో సాగు, తాగు నీటి సమస్య కొనసాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్దేశంతో గతంలో కేటీఆర్‌తో కలిసి రూ.104 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. కాల్వల ద్వారా కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి అంకుశాపూర్తో పాటు చుట్టుపక్కల 15 గ్రామాల చెరువులను నింపే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నీళ్లు అందించిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తానని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు, వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వృద్ధుల్లో వయసు పెరిగే కొద్దీ చూపు మందగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఇసుక, మట్టి వంటి ప్రాథమిక వనరులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా, ఇళ్ల నిర్మాణం చేసుకునే పేదలకు సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, సర్పంచులు కుర్రె మల్లయ్య, భూక్య రవి, బైకని రామ బాలరాజు, దండెం శ్రీనివాస్, మంచినీళ్ళ రాజు, మాజీ ఎంపీటీసీ భూక్య జుమ్లాల్ నాయక్, పెద్ది రాజిరెడ్డి, తేజావత్ గోవర్థన్, నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, జొన్నగొని సుదర్శన్ గౌడ్, నూకల కృష్ణ మూర్తి, తాళ్ళ పల్లి రాజేశ్వర్ గౌడ్, బుస యాదగిరి, నాగపూరి కిషన్ గౌడ్, ముక్కెర బుచ్చిరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.









