జనగామ, 10 September
అక్రమ అరెస్టులు ఎన్నాళ్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా
అక్రమ అరెస్టులు ఎన్నాళ్లు? ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఎలాంటి పిలుపు లేకపోయినా తెల్లవారుజామునే పోలీసులు వచ్చి అరెస్టులు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందంటూ గురువారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో పోలీసులు తమ వద్దకు వచ్చి అరెస్టు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలాంటి పిలుపు ఇవ్వలేదని, తమకు కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. అయినప్పటికీ ముందస్తు చర్యల పేరుతో అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులను కార్యక్రమాలకు ముందే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. “అక్రమ అరెస్టులు ఎన్నాళ్లు? ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని అణచివేయడం తగదు” అని వంగ ప్రణీత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.









