రైతు ప్రతినిధిని వేదికపైకి రాకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి
జిల్లా కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని మూడు మండలాల రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అలాంటి వ్యక్తిని సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రోటోకాల్ పేరుతో వేదికపైకి రాకుండా అడ్డుకోవడం సమంజసం కాదని కొమ్మూరి పేర్కొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరుల వ్యవహారశైలి సరికాదని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి ఏ హోదాలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో లేని ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవడం సహించలేకే వేడుకల్లో వివాదాలకు తెరలేపారని పల్లాపై కొమ్మూరి ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు ఆటంకం కలిగించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని ఆరోపించిన కొమ్మూరి, ఇటీవల నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో ఈ అంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలను త్వరలో బయటపెడతామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భానుక శివరాజ్ యాదవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు రామగళ్ల విజయ్, మిద్దపాక భాస్కర్, నీరటి రజిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కడకంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












