ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం..
జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన దసరా వేడుకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఘర్షణకు దారితీసిన సంఘటన
దుర్గమ్మ ఆలయంలోకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెళ్తున్న సమయంలో, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ నాయకులను నెట్టివేశారని ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో దసరా వేడుకల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పండుగ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.











