జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని జై భవానీ రైస్ మిల్లుపై అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సుమారు పదిహేను రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా మిల్లుపై తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం, ఉండాల్సిన ధాన్యం పరిమాణం, అలాగే ధాన్యం లోటుకు సంబంధించిన వివరాలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. లోటుకు సంబంధించి వివరణ ఇవ్వడంతో పాటు, ఆ లోటును భర్తీ చేసేందుకు మిల్లు యాజమాన్యానికి 15 రోజుల గడువు ఇచ్చారు.
మిల్లు నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవడంతో
అయితే, అధికారులు ఇచ్చిన గడువు పూర్తయినప్పటికీ మిల్లు నిర్వాహకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో, గురువారం సంబంధిత అధికారులు మరోసారి మిల్లును సందర్శించారు. అనంతరం మిల్లుపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో, జై భవానీ రైస్ మిల్లుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మండలంలో చర్చనీయాంశంగా మారింది.











