సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాన్ని ప్రభుత్వం వెంటనే మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల సర్పంచులు మండల సభను బహిష్కరించి నిరసన తెలిపారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్పంచులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే మద్దూరు మండలాన్ని మండలంగా ప్రకటించలేదని వారు ఆరోపించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మండలంలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయని, సాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాల కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు పేర్కొన్నారు. మద్దూరు మండలాన్ని మండలంగా ప్రకటించే వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని, వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
అనంతరం అక్కడికి చేరుకున్న ఎస్సై మహమ్మద్ ఆసిఫ్, ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచులకు నచ్చజెప్పి, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సర్పంచులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దామెర మల్లేశం, నీరటి శ్రీనివాస్, ఇట్టబోయిన కనకచంద్రం, కాసర్ల రేణుక కనకరాజు, గడిపే మౌనిక అనిల్ కుమార్, జక్కుల లింగమ్మ కనకయ్య, కర్నె సునీత మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.












