గ్రామ అభివృద్ధి లక్ష్యం... సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్
గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని అంకుశాపూర్ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ పిలుపునిచ్చారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతోపాటు ఉపాధి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త మేట్లను నియమించిన అనంతరం, పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు లభించే పని దినాలు, కూలీ వేతనాలు పొందే విధానం, పనుల్లో పాటించాల్సిన నిబంధనలు, మేట్ల బాధ్యతలను వివరించారు. కూలీలకు పథకంపై పూర్తి అవగాహన ఉంటేనే ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరన్నారు. గ్రామంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి పనుల సమాచారం చేరేలా చూడాలని, కూలీలు పనులకు హాజరైనప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత మేట్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులను కేవలం కూలీ పనులకే పరిమితం చేయకుండా, గ్రామానికి ఉపయోగపడే అభివృద్ధి పనులుగా మలుచుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ బైకని రమ బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగపూరి కిషన్ గౌడ్, వార్డు సభ్యులు కొమ్మరాజుల ప్రేమలత మల్లేష్, నాగపురి ఝాన్సీ సతీష్ గౌడ్,శివరాత్రి మల్లేష్,జంజల సంతోష్, నాగపూరి రాజేష్, తోట మల్లయ్య, కారోబార్ కృష్ణ, మేట్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.












