జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి రిజర్వాయర్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
స్టేషన్ ఘన్పూర్ నుండి చిలుపూర్ మండలం దేశాయి తండా వైపు వెళ్తున్న ఒక షిఫ్ట్ కారు అదుపుతప్పి రిజర్వాయర్లో పడింది. స్థానికుల కథనం ప్రకారం, కారు పల్టీలు కొట్టుకుంటూ నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో కారు అద్దాలు పగిలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ధారావత్ చరణ్ (18) తీవ్రంగా గాయపడ్డాడు. అతను కారు నుంచి బయటపడి, గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసింది. స్థానికులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
కారు నడుపుతున్న భూక్యా పవన్ ఆచూకీ తొలుత లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఐ రాజేష్ నేతృత్వంలో రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. శోద నలో భూక్యా పవన్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరు, కారు వేగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనతో దేశాయి తండా పరిసర ప్రాంతాల్లో విషాదకర వాతావరణం నెలకొంది.
మరోవైపు, గాయపడిన ధారావత్ చరణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడి కానున్నాయి.






