జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోవాలని, ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి కలెక్టర్ అధికారులతో చర్చించారు. మిల్లుల వారీగా ధాన్యం దిగుమతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద లారీల దిగుమతిలో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
మిల్లులకు వచ్చిన ధాన్యం లారీలను త్వరగా దిగుమతి చేసుకుని, కొనుగోలు కేంద్రాలకు వెంటనే వెళ్లేలా ప్రతి మిల్లు వద్ద నియమించిన అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దిగుమతిని పెంచడానికి అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓపీఎంఎస్ నమోదు, మిల్లర్ల ధృవీకరణ ప్రక్రియలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పౌరసరఫరాల అధికారులు ప్రతి మిల్లును సందర్శించి, ధాన్యం దిగుమతిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం బస్తాల రవాణా విషయంలో స్పందించని లారీ డ్రైవర్లపై తగు చర్యలు తీసుకోవాలని, ఏ కేంద్రానికి కేటాయించిన లారీ అదే కేంద్రానికి తరలి వెళ్లాలని సూచించారు. ధాన్యం బస్తాల రవాణా పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, దిగుమతిలో తాత్కాలిక నిల్వ గోదాములను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, ఇంచార్జి డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, ఏపీడీ నూరుద్దీన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








