చేర్యాల, జూలై 6
చేర్యాల తహసీల్దార్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్్యహ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆదివారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
చేర్యాల తహసీల్దార్ నాయక్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్్యహ్యాండెడ్గా చిక్కారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:40 గంటల సమయంలో తన కార్యాలయంలోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, నాగపురి గ్రామంలోని 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/E సర్వే నంబర్లలో ఉన్న 11.30 గుంటల భూమికి సంబంధించిన 8 దరఖాస్తులను ప్రాసెస్ చేసి, అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి తహసీల్దార్ లంచం డిమాండ్ చేశారు. మిగిలిన ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.70 వేలు కోరినట్లు విచారణలో తేలింది. ఈ భూములు జమున కనకమ్మతో పాటు మరికొందరి పేర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, తహసీల్దార్ కార్యాలయంలోనే రూ.70 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.











