తరిగొప్పుల, 2026-11-26
అంబేద్కర్ ఆశయాల సాధనే సమానత్వ సమాజ లక్ష్యం ఎంపీడీవో శంకర్ నాయక్
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుషాపూర్ గ్రామంలో సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్, ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో శంకర్ నాయక్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ నాయక్ మాట్లాడుతూ... 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం దేశ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకోవడంతోపాటు పౌరులుగా తమ కర్తవ్యాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ శ్రీకాంత్, వార్డు సభ్యులు పోతారబోయిన జాంజల సంతోష్, తోటో పద్మ మల్లయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.







