కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 23
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జన్మదినోత్సవ వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై, గ్రామ పురవీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం స్వామివారికి అభిషేకం, పాదపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. కార్తీక సోమవారం పురస్కరించుకొని రుద్రాభిషేకం, మహిళలచే విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సత్యసాయి అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ మహోత్సవాన్ని గ్రామ పురవీధుల గుండా భక్తుల భజనలు, నామస్మరణల మధ్య ఘనంగా జరిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవాళికి అందించిన ప్రేమ, సేవ, సత్యం, ధర్మం, శాంతి, అహింస అనే విలువలను ఆచరణలో చూపిస్తూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు, గ్రామ ప్రజలకు అన్నప్రసాదం అందించి సేవా భావాన్ని చాటుకున్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నంగునూరు వెంకటేశ్వర్లు సహకరించారు.
సాయంత్రం స్వామివారి 101వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 108 ప్రమిదలతో సామూహిక దీపోత్సవం నిర్వహించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక కన్వీనర్ నంగునూరు హరిబాబు, భగవాన్ శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు నందకిషోర్ శర్మ, ఉప్పల రాజు, నాగరాజు, గంగిశెట్టి పాండురంగం, శ్రీనివాస్, కృష్ణమూర్తి, బాలయ్య, రాజ్ కుమార్, కాపర్తి రాజు, సాయి శంకర్, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సేవలో పునీతులయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, మానవత్వం, నిస్వార్థత అనే సందేశాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని భక్తులు ఈ సందర్భంగా తెలిపారు.







