సూర్యాపేట, 2020-11-15
పట్టా పాస్ పుస్తకాలు, నాలా కన్వర్షన్, ప్లాట్ నంబర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సామాన్య ప్రజలు, రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి లక్షలాది మందికి న్యాయం చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూ రికార్డులు, రిజిస్ట్రేషన్లు, లేఅవుట్ అనుమతులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఇప్పటికీ 22-ఎ నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని తెలిపారు. కోర్టు తీర్పుల ద్వారా 22-ఎ జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో సకాలంలో మార్పులు చేయకపోవడంతో రైతులు, ప్లాట్ల కొనుగోలుదారులు బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రూ.10 వేల చొప్పున చెల్లించిన లక్షలాది మంది ఇప్పటికీ ఆమోద పత్రాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుసుము చెల్లించినప్పటికీ అనుమతులు లేక ఇళ్లు నిర్మించుకోలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వచ్చినప్పటికీ, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యం కొనసాగుతోందన్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేలా స్పష్టమైన విధానం తీసుకురావాలని కోరారు. నాలా కన్వర్షన్కు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, లేఅవుట్ అనుమతి మంజూరైన వెంటనే ఆటోమేటిక్గా నాలా కన్వర్షన్ ఇచ్చే విధానం అమలు చేయాలని సూచించారు. రెండు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు లేఅవుట్ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల చిన్న రైతులు నష్టపోతున్నారని, ఆ నిబంధనలను సరళీకరించాలని కోరారు.
రేరా అనుమతి ఉన్న లేఅవుట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. ఒకే సర్వే నంబరులో 50 ప్లాట్లు ఉన్నప్పటికీ, ప్లాట్ నంబర్, లేఅవుట్ మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో కొనుగోలుదారులు తమ ప్లాట్లను గుర్తించలేకపోతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, లింక్ డాక్యుమెంట్ల పరిశీలనను 1954 నుంచి కాకుండా గత 13 ఏళ్లకు పరిమితం చేయాలని సూచించారు. ప్రతి ఏడాది మార్కెట్ విలువలు పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ ఫీజుల భారం ప్రజలపై అధికంగా పడుతోందని, ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని కోరారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతుల కోసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతోందని, ఈ జాప్యాన్ని నివారించేందుకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి పట్టేటి కిరణ్, వెంకటరెడ్డి, రసీదు, మదనచారి, శేఖర్, రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.






