నర్మెట్ట గ్రామంలోని జై భవాని ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో భారీ కొరతను గుర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రైస్‌మిల్లు యజమానులైన రామిడి నరసింహారెడ్డి, గజ్జల శ్రీశైలంలను జనగామ ఏసీపీ శ్రీ భీమా శర్మ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి వివిధ ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని జై భవాని ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మిల్లు యజమానులుగా రామిడి నరసింహారెడ్డి, గజ్జల శ్రీశైలం, గంగుల కమల (శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె), మల్లాడి శితిజ (కృష్ణారెడ్డి కుమార్తె) ఉన్నట్లు పేర్కొన్నారు.
తనిఖీల్లో భారీ కొరత గుర్తింపు
ఈ నెల 24న వరంగల్‌కు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లైస్ శాఖ, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గజ్జల శ్రీశైలం, పంచుల సమక్షంలో మిల్లులోని ధాన్యం నిల్వలను పరిశీలించారు.
ప్రభుత్వానికి సంబంధించిన 3,632.686 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాల్సి ఉండగా, తనిఖీల్లో 2,107.384 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కొరత ధాన్యం విలువ రూ.5,75,36,323గా నిర్ధారించారు.
నలుగురు యజమానులపై కేసు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మేనేజర్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారి వాంకుడోత్ హాతీరాం, సివిల్ సప్లైస్ అధికారులు, కే. సురేష్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు మిల్లు యజమానులపై నర్మెట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా రామిడి నరసింహారెడ్డి, గజ్జల శ్రీశైలంలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తులో నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్ఐ నగేష్‌తో పాటు పోలీసు సిబ్బంది మసూద్ పాషా, రాజా మల్లయ్య, గడ్డే రాము, ఎండీ. హమీద్ పాల్గొన్నారు. ప్రభుత్వ ధాన్యం కొరతకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.












