తరిగొప్పుల, సెప్టెంబరు 26: ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలో భాగంగా బోంతగట్టునాగారంలో ఐదో విడత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కుర్రె మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలను పరిశీలించారు. పనుల నిర్వహణ, కూలీలకు కల్పించిన పనిదినాలు, హాజరు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
సామాజిక తనిఖీ బృందం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించింది. పనులు జరిగిన ప్రదేశాలు, కూలీల హాజరు, పనిదినాల నమోదు, చెల్లింపులకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. పథకం అమలులో ఏవైనా సమస్యలు ఉంటే గ్రామసభ దృష్టికి తీసుకురావాలని కూలీలను కోరారు.
ఈ సందర్భంగా సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంలో ఉపాధి హామీ పథకం కీలకకంగా ఉందన్నారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి చేపడుతున్నామని తెలిపారు. పనుల ఎంపిక నుంచి అమలు వరకు ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్ధి, కూలీలకు ఉపాధి కల్పనకు సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
గ్రామసభలో పలువురు కూలీలు తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి పనులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామస్థుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను నమోదు చేసిన అధికారులు సంబంధిత అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కర్ణణాకర్, గ్రామ కార్యదర్శి రవీందర్ , ఆడిట్ ఆఫీసర్ పరుశరాములు, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


