అధికారులు మధ్యలోనే వెళ్లిపోతున్నారని, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు
అధికారులకు సమయం ఉంటేనే మండల సమావేశం నిర్వహించాలని, సమావేశం మధ్యలోనే అధికారులు వెళ్లిపోతున్నారని తమ సమస్యలు ఎవరికి చెప్పాలని మండల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల పనితీరును వివరించారు. ఆగాపేటలో ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సర్పంచ్ రాజు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ అండ్ బీ రోడ్లు మరమ్మత్తు చేయాలని, జనగాం దారిలో కాజ్ వే దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయని నర్మెట్ట సర్పంచ్ శ్రీధర్ తెలిపారు. వెల్దండ - జనగాం రోడ్డుపై చెట్లు రోడ్డుపైకి వచ్చాయని తెలిపారు. పేరుకే డబుల్ రోడ్డు అయినా, సింగల్ రోడ్డులా ఉందని అన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు సరిగా పనిచేయడం లేదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సరిగా లేదని మల్కాపేట సర్పంచ్ మహేందర్ సభకు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నాగ శేషాద్రి సూర్య, తహసిల్దార్ రమణాచారి, ఎంపీడీవో చిదురాల సుమన్, మండల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.












