Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 14
అక్రమ అరెస్టులతో యువత ఉద్యమాన్ని అణచలేరు బీజేవైఎం నాయకుడు రాజు యాదవ్
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు సిద్ధమైన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేవైఎం నాయకుడు రాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని, అక్రమ అరెస్టులతో యువత ఉద్యమాన్ని అణచలేరని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల భృతి, ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల వంటి హామీలను యూత్ డిక్లరేషన్లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
తెలంగాణ పర్యటనకు వచ్చే రాహుల్ గాంధీ, ముందుగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుండా యువతను మభ్యపెట్టడం తగదని ఆయన అన్నారు.
ముందస్తు అరెస్టులతో యువత గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంటూ, అరెస్టు చేసిన బీజేవైఎం కార్యకర్తలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు, యూత్ డిక్లరేషన్ హామీలు అమలయ్యే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని రాజు యాదవ్ హెచ్చరించారు.






