నర్సంపేట్, 14 November
1,189 మందికి నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలో పండుగ వాతావరణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద ముఖ్య అతిథులుగా హాజరై నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
మున్సిపాలిటీ పరిధిలో 769 మందికి, మండల పరిధిలో 420 మందికి కలిపి మొత్తం 1,189 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
అధికారుల ప్రతిస్పందన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వసంత, డీఆర్డీఏ పీడీ నాగపద్మజ, ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






