నర్మెట్ట గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలు, గ్రామసభ కార్యక్రమాన్ని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోసం వివిధ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులకు సర్పంచ్ శ్రీధర్ గౌడ్ బహుమతులు అందజేసి అభినందించారు. దీంతో పిల్లల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అనంతరం నిర్వహించిన గ్రామసభలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రజలకు అందించాల్సిన మెరుగైన సేవలపై చర్చించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తుకు, సర్వతోముఖాభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే, చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమన్, పంచాయతీ కార్యదర్శి నసీరుద్దీన్, ఉప సర్పంచ్ కొలెపాక స్వామి, వార్డు సభ్యులు కొలెపాక యాదగిరి, చెప్పాల మహిపాల్ రెడ్డి, పొన్నం బాలకృష్ణ, కొన్నె యాదలక్ష్మి చంద్రయ్య, కూకట్ల మమత సంపత్, తుప్పుడు శ్రావణి మహేష్, గోరంతల స్వాతి రాజు, గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, యువకులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






