నంగునూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 15
దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న సిద్దిపేట రావడం సరికాదని, ఆయనను అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు కే దాసి మోహన్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ సూటి ప్రశ్నలు సంధిస్తోందని తెలిపారు. రాజేందర్ మాట్లాడుతూ, ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డమీద అడుగుపెట్టేముందు దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయకుండా వస్తే సహించేది లేదని, ఆ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, అమలుకు నోచుకోవడం లేదని, దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నందున వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
చేవెళ్ల డిక్లరేషన్‌తో పాటు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులకు అనేక వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. దళిత బంధు పథకం స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా దళితులకు 12 లక్షల రూపాయలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా సిద్దిపేటకు వస్తే సహించేది లేదని, ఆ లోపు అమలు చేయకపోతే అడ్డుకొని తీరుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దేవులపల్లి నాగరాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల నరసింహులు, మండల అధికార ప్రతినిధి దేవులపల్లి కృష్ణ, మండల సీనియర్ నాయకులు దేవులపల్లి భూమయ్య, దేవులపల్లి కనకయ్య, అజితు తదితరులు పాల్గొన్నారు.






