జనగామ, 12 September
జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ కాలనీ వాసులు మత సామరస్యానికి సరికొత్త సందేశాన్ని అందిస్తున్నారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు ముస్లిం సోదరులు స్వయంగా ముందుకొచ్చి చందాలు అందించడమే కాకుండా, చందా పుస్తకంలో రాస్తూ ఉత్సవాలకు సహకరిస్తున్నారు. ఈ తరహా స్నేహపూర్వక వాతావరణం ప్రతి సంవత్సరం కొనసాగుతోంది.
గుండ్లగడ్డ మత సామరస్యానికి సరికొత్త సందేశం.. - వినాయకుడి ఉత్సవాలకు ముస్లిం సోదరుల సహకారం.. - పండుగ ఏదైనా ఒకరికొకరు అండగా నిలుస్తున్న వైనం.. పండుగ ఏదైనా ఆనందం అందరిది అనేలా మతాలు వేరైనా.. మనసులు ఒక్కటేనని చాటుతూ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ కాలనీ వాసులు మత సామరస్యానికి సరికొత్త సందేశాన్ని అందిస్తున్నారు. గణేష్ నవరాత్రులు పురస్కార హుకొని ఉత్సవాల నిర్వహణకు కమిటీ సభ్యులు చందాలు సేకరిస్తుండగా, ముస్లిం సోదరులు సైతం స్వయంగా ముందుకొచ్చి చందాలు అందించడమే కాకుండా, గణేష్ నవరాత్రుల కోసం చందాలు అడుగుతూ తమ చేతులతోనే చందా పుస్తకంలో రాస్తూ ఉత్సవాలకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా ముస్లిం సోదరుల పండుగలు, కార్యక్రమాల సమయంలోనూ హిందూ సోదరులు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం గుండ్లగడ్డ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మతాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగలు వేరైనా.. బంధం ఒక్కటేనని, మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని కాలనీ వాసులు తమ ఆచరణతో చాటుతున్నారు. ఒకరి పండుగకు మరొకరు సహకరిస్తూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములవుతూ గుండ్లగడ్డ కాలనీ హిందూ–ముస్లిం సోదరభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పండుగలు మనుషులను విడదీయడానికి కాదు.. మనసులను కలపడానికి అనే సందేశాన్ని గుండ్లగడ్డ వాసులు ఆచరణలో చూపిస్తున్నారు. మత సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసి జీవిస్తే సమాజం మరింత బలపడుతుందనే గొప్ప సందేశాన్నీ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.









