సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు పరిధి ఎర్రగట్టు తండాలో వేప చెట్టు వివాదం ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు తీసిన దారుణ సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా యాదవులు పూజించే దేవతా వృక్షాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన పెదబాబు, అతని కుమారులు, సోదరుడు కలిసి ఒక వ్యక్తిని, తన తండ్రిని కూడా గొడ్డలితో నరికి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనలో ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అయిన పెదబాబు, అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎర్రగట్టు తండాకు చెందిన పెదబాబు అనే వ్యక్తి, స్థానికంగా యాదవులు పూజించే దేవతా వృక్షాన్ని కూల్చివేయడానికి గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నాడు. చెట్టుపై యాసిడ్, పలు రసాయనాలు పోసి దానిని నిర్జీవం చేసి కూల్చివేయడానికి పెదబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలను తండావాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా, యాసిడ్, రసాయనాల ప్రభావంతో చెట్టు వేర్లు మోడుబారిపోయి కూలిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదవుల పెద్ద వెంకటేశ్వర్లు, చెట్టును అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు.
వెంకటేశ్వర్లు ప్రశ్నించిన వెంటనే పెదబాబు, అతని కుమారులు కలిసి వెంకటేశ్వర్లుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. గొడ్డలితో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. వృద్ధుడైన వెంకటేశ్వర్లుపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పెదబాబు తండ్రి సైదా భూక్యాపై కూడా, సొంత తండ్రి అని కూడా చూడకుండా పెదబాబు, ఆయన సోదరుడు రాము గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో సైదా కూడా తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు.
కుమారుల మారణకాండకు సొంత తల్లి సహకరించిందని, తన కళ్లముందే కన్న బిడ్డలు భర్తను దారుణంగా నరికి చంపుతుంటే అడ్డుకోవాల్సింది పోయి సహకరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అయిన పెదబాబు వ్యవహార శైలి ఒక ఉన్మాది మాదిరిగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఆయన ఉన్మాద చర్యల వల్లే ప్రభుత్వం ఇతన్ని సస్పెండ్ చేసిందని తెలిపారు. తండాలో అందరితో గొడవలు పడటం, నిందలు వేసి వేధింపులకు గురిచేయడం ఆయన కుటుంబ సభ్యులకు నిత్యకృత్యంగా మారిందని తండావాసులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నవీన్ పై పెదబాబు కుటుంబసభ్యులు రాళ్లు విసిరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ ఎస్సై అక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనపై స్పందించారు.
ఈ దారుణ మారణకాండతో ఎర్రగట్టు తండాలో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టుపక్కల తండాలు, గ్రామాల వాసులు కూడా భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం. హంతకులైన పెదబాబు, రాములను, వారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. తండాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











