చిన్నకోడూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, సిద్దిపేట జిల్లాలో గ్రేడింగ్ పేరుతో 70 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం దారుణమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తుఫాన్ ముప్పు నేపథ్యంలో కల్లాల్లోని వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టు బండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు శనివారం సందర్శించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ జరగక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మౌలిక వసతులు లేవనే సాకుతో ఎల్ 2 గ్రేడ్ కేటాయించి 50 ఐకేపీ కేంద్రాలను, 20 ప్యాక్స్ సొసైటీలను కలిపి మొత్తం 70 కొనుగోలు కేంద్రాలను మూసివేశారని తెలిపారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని కేంద్రాలు కూడా మూతపడటంతో 70 గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రం మొత్తం మీద ఇప్పటిదాకా ప్రభుత్వం కొన్న దొడ్డు వడ్లు కనీసం లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటలేదని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనకుండా ప్రభుత్వం కావాలనే రైతులను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
ఇవాళ ఉదయం నుంచి ఎంతోమంది రైతులు తనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ కేంద్రాలు తెరవకపోవడంతో దొడ్డు వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ రూ. 2,100 కే అమ్ముకుంటున్నామని, అందులోనూ బస్తాకు 2 కిలోల తరుగు తీస్తున్నారని, వెంటనే డబ్బులు ఇవ్వాలంటే 1 శాతం కటింగ్ పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చివరకు రైతు చేతికి రూ. 2,000 కూడా దక్కడం లేదని వాపోయారు.
ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేస్తే రైతుకు క్వింటాల్‌కు రూ. 2,461 మద్దతు ధర వస్తుందని తెలిపారు. కానీ ప్రభుత్వం కొనకపోవడం వల్ల క్వింటాల్‌కు రూ. 461 చొప్పున, ఎకరానికి రూ. 14 వేల నుంచి రూ. 15 వేల వరకు ప్రతి రైతు నష్టపోతున్నారని వివరించారు. పెట్టుబడి, కష్టం అంతా వృథా అవుతోందని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వడ్ల కొనుగోళ్లకు ఇబ్బంది రాలేదని, కల్లాలకు రాగానే వెంటవెంటనే కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా గ్రేడింగ్ పద్ధతి అని పెట్టి 7080 సెంటర్లు మూసేశారని ఆరోపించారు. ఉన్న సెంటర్లలోనూ వడ్లు కొనడం లేదని తెలిపారు. ఇప్పటికీ మిల్లుల అలాట్మెంట్ జరగలేదు, గోదాముల ఏర్పాటు లేదు. కావాలనే ఆలస్యం చేస్తే రైతులు విసిగిపోయి బయట అమ్ముకుంటారని, తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని అన్నారు.







