జనగామ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో, గ్రామ పంచాయతీల నుంచి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచులను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపగాని శ్రీధర్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైనప్పటికీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు మాత్రమే వేదికపై అవకాశం కల్పించడం సరికాదని ఆయన అన్నారు.
గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సర్పంచులకు అధికారిక కార్యక్రమంలో కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులను ప్రభుత్వ కార్యక్రమాల్లో పక్కన పెట్టడం ద్వారా జనగామ జిల్లా సర్పంచులందరినీ అవమానించినట్లేనని ఆయన పేర్కొన్నారు.
ఇకపై నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో సర్పంచులకు తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచుల అనుసరించిన తీరును జనగామ జిల్లా సర్పంచుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.












