మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్ సూచించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పలగడ్డ గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో సీఐ దేవేందర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, గుట్కా తదితర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. కళాబృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా ప్రజలకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. విద్య ప్రాధాన్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డయల్ 112 సేవలు, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం వంటి అంశాలను పాటల ద్వారా వివరించారు.
సైబర్ నేరాలపై ప్రదర్శించిన నాటికతో పాటు 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌పై అవగాహన కల్పించారు. కళాబృందం ప్రదర్శించిన పాటలు, నాటికలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నగేశ్, గ్రామ సర్పంచ్, పోలీసు సిబ్బంది, కళాబృందం ఇన్చార్జి మహిళా ఏఎస్సై నాగమణి, హెడ్ కానిస్టేబుళ్లు విలియం, వెంకటేశ్వర్లు, పీసీ పూల్‌సింగ్, హోంగార్డులు శ్రీనివాస్, నారాయణ, విక్రమ్‌రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.












