సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరల మేరకు సన్న బియ్యం అమ్మకాలు జరిగేలా పౌర సరఫరాల శాఖ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా రత్నదీప్ సూపర్ మార్కెట్, మోర్ సూపర్ మార్కెట్, నేషనల్ సూపర్ మార్కెట్, శ్రీ రాజ మల్లికార్జున రైస్ డిపో, శేషాద్రి రైస్ డిపోలలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా లీగల్ మెట్రాలజీ (తూనికలు మరియు కొలతలు) అధికారి శివరంజని, సహాయ పౌరసరఫరాల అధికారి సాయి రవి కలిసి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు.
పై తనిఖీలలో శ్రీ రాజ మల్లికార్జున రైస్ డిపో నందు తూకం విషయంలో తేడాలు గమనించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు షాపుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా కొలతల అధికారి వెల్లడించారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే సన్న బియ్యం విక్రయాలు జరిగేలా చూడాలని, తూనికల్లో ఎలాంటి తేడాలు లేకుండా నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ఈ ప్రకటనను జారీ చేసింది.






