మద్దూరు, 2026-11-21
- మద్దూరు కాంగ్రెస్ సర్పంచులు
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు చేసిన ఘాటు, అనుచిత వ్యాఖ్యలను మద్దూర్ మండల సర్పంచులు ఇట్టబోయిన కనక చంద్రం, సుందరగిరి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శనివారం మద్దూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచులు మాట్లాడుతూ, ప్రజలచే ఎన్నుకోబడిన ఓ పార్లమెంట్ సభ్యుడిపై వ్యక్తిగతంగా, హుందాతనం లేకుండా మాట్లాడటం రాజనర్సు గారికి తగదు. రాజకీయ విమర్శలు ఉంటే అభివృద్ధి, విధానాలపై చేయాలి తప్ప, వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా సిద్దిపేట జిల్లా, జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, దూలిమిట్ట, చేర్యాల, కొమురవెల్లి అభివృద్ధి కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి భాష వాడటం వల్ల సిద్దిపేట జిల్లా పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజనర్సు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఎంపీకి, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల సమక్షంలోనే పార్టీ నాయకులను, కార్యకర్తలను గంజాయి బ్యాచ్ అని, తాగుబోతులని, రౌడీలని సంబోధిస్తూ మాట్లాడటం సబబు కాదని, మీరు మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు మాట్లాడే భాషను యువత గమనిస్తుంది. మన భాషే మన సంస్కారం. అందుకే అందరూ హుందాగా మాట్లాడాలి అని సర్పంచులు కనక చంద్రం, సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మద్దూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బియ్య మహేష్, డీసీసీ కార్యదర్శి పుల్లూరి రాజు, మండల ఉపాధ్యక్షులు జీడి కంటి సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు పాపిరెడ్డి, మద్దూరు మండల్ సీనియర్ నాయకులు ముంతాజ్, పసిబయ్, వార్డు సభ్యులు సరిత సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీరాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







