కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
సిద్దిపేట జిల్లాలో 659 నూతన చేయూత పింఛన్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో గల లక్ష్మీ గార్డెన్స్‌లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను మంగళవారం లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. మండలానికి మొత్తం 659 నూతన చేయూత పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల పింఛన్లకు సంబంధించి అర్హులైన వారిలో ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన వృద్ధులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి భార్య పేరు మీద పింఛన్ బదిలీ చేసేలా నూతన విధానం తీసుకొచ్చామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి ఏడాది 3,500 ఇందిరమ్మ ఇళ్లు, ఈ ఏడాది మరో 2,000 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అత్యంత పేదలకు, ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని, శుభకార్యాలు, విందులకు ఉచితంగా స్టీల్ సామగ్రిని వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఆర్వీఎం మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య, రక్త పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20న ప్రత్యేక శిబిరం నిర్వహించి వికలాంగులు, వృద్ధులు, వినికిడి సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్షలతో పాటు అవసరమైన సహాయక పరికరాలు అందిస్తామని తెలిపారు. అర్హులకు చేతికర్రలు, ట్రైసైకిళ్లు, ఈవీ వాహనాలు, వినికిడి యంత్రాలు, నడుము, మోకాలి బెల్టులు, వెస్ట్రన్ కమోడ్ పరికరాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్టులతో పాటు వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని, క్రీడల అభివృద్ధికి ఒక్కో గ్రామానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. పేదరికం నుంచి బయటపడేందుకు విద్యే ఏకైక మార్గమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫామ్ పాండ్లు, గ్రామాల్లో ఊటకుంటలు నిర్మించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంపొందించుకుని కరువు పరిస్థితులను అధిగమించాలని, నీటి లభ్యతను బట్టి ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మహిళలకు త్వరలోనే కొత్త ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే కాలువల నిర్మాణం పూర్తి చేసి హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, పేదల ఆర్థిక పురోగతే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఆత్మ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







