కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 16
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ సభలో ఇందిరమ్మ బీమా, నూతన పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే, 20న వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి సారథ్యంలో మండలం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళేలా మండలంలోని సముద్రాల, మైసంపల్లి, కాచాపూర్, సి.సి. పల్లె గ్రామాల్లోని సర్పంచులు, అధ్యక్షులు, సీనియర్ నాయకులతో మండలంలోని ఆయా గ్రామాల ఇంచార్జీలు బీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, దూలం శ్రీనివాస్ గౌడ్, ఆవుల మహేందర్ గార్లతో కలిసి సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవారికి ఇందిరమ్మ బీమాను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో నిలిచిపోయేలా సుమారు నాలుగు లక్షల అరవై మూడు వేల మందికి నూతన పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మన రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి సారథ్యంలో మన మండలానికి దాదాపు ఏడు వందల మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరు అయినట్లు తెలిపారు. కావున, మండలంలోని ఆయా గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వచ్చి, ప్రజా పాలన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే, హుస్నాబాద్ నియోజకవర్గంలోని వృద్ధులకు, దివ్యాంగులకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మన అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారు, మండలంలోని అన్ని గ్రామాల్లోని వికలాంగులకు, వృద్ధులకు అలింకో సహకారంతో ఉచితంగా పరికరాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలోని లక్ష్మి గార్డెన్లో ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, లబ్ధిదారుల పేర్లను నమోదు చేయించి, వారికి ఉచిత పరికరాలు అందేలా ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.







