*కొండపాక (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 11
సిద్దిపేట జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా, సిద్దిపేట మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్పడగ గ్రామంలో గ్రామ పంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను, మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామంలో 30 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలు నేరాల నిరోధానికి, జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి 24/7 గ్రామాలను నిఘా నీడలో ఉంచుతూ, ప్రజలకు ఒక అదనపు రక్షణ పొరలా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళు, వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది అని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం చాలా ముఖ్యం. టీవీ లేదా మొబైల్ ఫోన్ పాడైతే ఎలా రిపేర్ చేసుకుంటామో, అలాగే సీసీ కెమెరాలకు కూడా వెండర్లతో 2-3 ఏళ్ల పాటు సర్వీస్ కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవాలి. క్రమబద్ధమైన నిర్వహణతో ఇవి చాలా కాలం పాటు సేవలు అందిస్తాయి.
సైబర్ నేరాలు, ఉద్యోగ మోసాలపై అప్రమత్తత
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు అడిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రస్తుతం ఫోన్లలోనే మన ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ఉంటోంది. కాబట్టి బ్యాంక్ పిన్లు, పాస్వర్డ్లను ఫోన్లలో సేవ్ చేయవద్దని, ఏ బ్యాంకూ ఫోన్ చేసి ఓటీపీ లేదా పిన్ నంబర్లు అడగదని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.
యువతకు సూచనలు
గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.
అభినందనలు, విజ్ఞప్తి
ఈరోజు ప్రారంభించిన 23 గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ ప్రజలకు పోలీస్ కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని మిగతా గ్రామాలు కూడా ముందుకు వచ్చి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట- టౌన్: హౌసింగ్ బోర్డ్ కాలనీ - 6 కెమెరాలు సిద్దిపేట- టౌన్: నెహ్రూ పార్క్ - 24 కెమెరాలు సిద్దిపేట- టౌన్: మర్పడగ - 40 కెమెరాలు, అంకిరెడ్డిపల్లి - 12 కెమెరాలు గజ్వేల్ టౌన్: గజ్వేల్ టౌన్ - 10 కెమెరాలు సిద్దిపేట రూరల్: తోర్నాల - 12 కెమెరాలు చిన్నకోడూర్: మెట్టుపల్లి - 10 కెమెరాలు బెజ్జంకి : గగిల్లాపూర్ - 10 కెమెరాలు దుబ్బాక : అప్పనపల్లి - 10 కెమెరాలు, పద్మనాభునిపల్లి - 10 కెమెరాలు, రజాక్కపేట - 12 కెమెరాలు, బలవంతాపూర్ అనుబంధ గ్రామంలో 2 కెమెరాలు భూంపల్లి: ఏనుగుర్తి - 12 కెమెరాలు జగదేవ్పూర్: తిగుల్ నర్సాపూర్ - 8 కెమెరాలు మర్కూక్: కాశిరెడ్డిపల్లి - 5 కెమెరాలు గౌరారం: అనంతగిరిపల్లి - 10 కెమెరాలు తొగుట: చందాపూర్ - 8 కెమెరాలు దౌల్తాబాద్: సూరంపల్లి - 6 కెమెరాలు కుకునూర్ పల్లి: వెలికట్ట - 23 కెమెరాలు బేగంపేట్: నెమ్టూర్ - 14 కెమెరాలు హుస్నాబాద్: రాములపల్లి - 7 కెమెరాలు కోహెడ: పోరెడ్డిపల్లి - 10 కెమెరాలు చేర్యాల్: దానంపల్లి - 4 కెమెరాలు, చీత్యాల - 7 కెమెరాలు మద్దూరు: బైరాన్పల్లి - 30 కెమెరాలు.






