కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ గ్రామం నుంచి శనిగరం మీదుగా సిద్దిపేటకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కోహెడ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని పట్టుకున్నారు.
వాహన డ్రైవర్లు దున్నపోతుల రాజు (23), మహమ్మద్ కరీం (22)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని కోహెడ పోలీస్ స్టేషన్కు తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పి. అభిలాష్ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.







