ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కపిల్ ఆదిత్య వెల్లడి
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జనగామ జిల్లా నూతన కార్యవర్గంలో మండలానికి చెందిన పులి కపిల్ ఆదిత్య ముదిరాజ్‌ను జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్ తెలిపారు. కపిల్ ఆదిత్య గత ఐదేళ్లుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో విద్యారంగ సమస్యలపై పలు ఉద్యమాల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. ఏబీవీపీ మండల కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, జనగామ జిల్లా హాస్టల్స్ కో-కన్వీనర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందిన కపిల్ ఆదిత్య బీజేవైఎం ఆధ్వర్యంలో రాబోయే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటారని హరీష్ అన్నారు. జిల్లా కార్యదర్శిగా నియమితులైన పులి కపిల్ ఆదిత్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్‌తో పాటు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. కపిల్ ఆదిత్యకు మండల బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.












