తరిగొప్పుల, అక్టోబర్ 08 . ఓరుగల్లు న్యూస్ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు గురువారం నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి-లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడు పండుగ కనకయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన నిరసనను అడ్డుకుని ఆయనను అరెస్టు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎన్నికల వ్యవస్థపై రాహుల్ గాంధీ లేవనెత్తిన అనుమానాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను విచారించి ఎన్నికల వ్యవస్థపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడం సరికాదని, ప్రతిపక్ష నాయకుడి హక్కులను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనగామ క్లస్టర్ ఆత్మ కమిటీ చైర్మన్ బట్టు మహేందర్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పింగిళి ఇంద్రారెడ్డి, మాజీ డైరెక్టర్ అర్జున పోసిరెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కత్తుల కొమురయ్య, జనగామ జిల్లా డీసీసీ కార్యదర్శి గోరంతల వీరన్న, దామర లూకా, కల్వ రాజు, తాళ్లపల్లి రాజు, రాజేష్ నాయక్, కొత్తతండా గ్రామశాఖ అధ్యక్షుడు రాజశేఖర్, అంకుషాపూర్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు చిన్నమూర్తి యాదగిరి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్రవెల్లి పోశయ్య, మండల కార్యదర్శి గాదపాక శ్రీనివాస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎడ్ల నవీన్ కుమార్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఖాతా పౌలు, మన్మోహన్ రెడ్డి,ఆనందం,ఖాతా గాలయ్య తదితరులు పాల్గొన్నారు.









