తరిగొప్పుల, 18 November
మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మైక్ వివాదం చోటుచేసుకుంది.
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్న చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా ప్రసంగిస్తున్న సమయంలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి మైక్ ఇవ్వాలనే అంశం వివాదానికి దారితీసింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించడంతో సంక్షేమ కార్యక్రమాలు సైతం వివాదాలకు వేదికవుతున్నాయని విమర్శించారు. పేదలకు అందాల్సిన పెన్షన్ల పంపిణీని పక్కనపెట్టి, ప్రోటోకాల్ వివాదానికి ప్రాధాన్యమివ్వడం సరికాదన్నారు.
పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, పెన్షన్ల పంపిణీ జరగలేదు. దీంతో ఉదయం నుంచే వేచి ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నిరాశతో వెనుదిరిగారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, తహసీల్దార్ మోసిన్ ముస్తఫా, సర్పంచ్ అర్జుల జ్యోతి, కుర్ర మల్లయ్య,దండం శ్రీనివాస్,బైకాని రమా బాలరాజు యాదవ్,భూక్య రవి నాయక్,భూక్యా లలిత రాజు, పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







