నర్మెట్ట, 18 November
బీడీ కార్మికులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నిబంధనల పేరుతో అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు అన్యాయం చేయడం సరికాదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులు, వృద్ధులు పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.4 వేలకు పెంచి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏడు రకాల పింఛన్లు అమలు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఐదు రకాల పింఛన్లకే మంజూరు పత్రాలు అందిస్తున్నారని, బీడీ కార్మికులు, వృద్ధాప్య పింఛన్లకు సంబంధించిన సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. బీడీ కార్మికులు, వృద్ధులు ఎన్నో ఏళ్లుగా పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి చేయూత అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పెండింగ్లో ఉన్న పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయం, జీవనోపాధి కోసం ట్రాక్టర్లు, జీపులు వంటి వాహనాలు కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న వారిని నిబంధనల పేరుతో పింఛన్లకు దూరం చేయడం సరికాదన్నారు. ఆర్టీఓ అనుమతులు, వాహనాల వివరాలు వంటి అంశాలను పరిశీలించి, వాస్తవంగా జీవనోపాధి కోసం వాటిని వినియోగిస్తున్న అర్హుల పరిస్థితిని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఒకే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేర్వేరు వృత్తుల్లో జీవిస్తున్న సందర్భాల్లో కూడా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్లను రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో జాప్యం చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని స్పష్టం చేశారు. పింఛన్లు అందని బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వారి పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఉద్రిక్తతకు వేదికైంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రసంగం అనంతరం చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడేందుకు సిద్ధం కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశానికి లబ్ధిదారులు, సర్పంచులు, సంబంధిత అధికారులను మాత్రమే అనుమతించారు. ఇతరులకు ప్రవేశం నిరాకరించారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని సద్దుబాటు చేశారు. సంక్షేమ పథకాల అమలులో రెండు రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు అధికారిక వేదికపై గొడవకు దిగడంతో సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించే బాధ్యతలో ఉండి, వేదికపై గొడవ పడడం సరైనది కాదని పేర్కొన్నారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.







