తరిగొప్పుల, 18 November
అర్హుల పింఛన్లకు రాజకీయ అడ్డంకులు తొలగించాలి... ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, పెండింగ్ దరఖాస్తులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని సోలిపూర్ రోడ్డులో గల రాజరాజేశ్వరి కన్వెన్షన్ హాల్లో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామాల్లో సుమారు 200 నుంచి 300 మంది కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలో పింఛన్లను రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచి పేదలకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. రూ.2 వేలు, రూ.4 వేల పింఛన్లు ఇస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వితంతువులు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులకు అర్హతల ప్రకారం పింఛన్లు అందించాలని, దివ్యాంగులకు రావాల్సిన రిజర్వేషన్లు, ఉద్యోగాలు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని సూచించారు.
అయితే, ఇదే కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఇది చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రసంగించిన అనంతరం, చేర్యాల మార్కెట్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి మైక్ ఇవ్వలేదనే అంశంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ వివాదం కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడంతో, ఉదయం నుంచే ఎదురుచూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నిరాశతో వెనుదిరిగారు.
అనంతరం ఎమ్మెల్యే 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, తహసీల్దార్ మోసిన్ ముస్తఫా, మసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుర్రె మల్లయ్య యాదవ్, సర్పంచ్లు దండెం శ్రీనివాస్,భూక్య రవి నాయక్,బైకాని రమా బాలరాజు యాదవ్,అర్జున్ జ్యోతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి,అధికార ప్రతినిధి చిలువేరు లింగం,పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







