సిద్దిపేట, 19 November
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రాజేందర్ ఆరోపించారు. దళిత బంధు స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్లతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి రాజేందర్ ఆరోపించారు. దళిత బంధు స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని మాటిచ్చారని, ఆ పథకం ఎక్కడ అమలు చేశారో దళితులకు చెప్పాలని ఆయన సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని రాజేందర్ విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకం ఎక్కడ మంజూరు చేశారో చెప్పాలని అడిగితే దళితులను అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, అమలుకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నందున వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దళితులంటే అంత చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో గద్దె దించే వరకు పోరాటం చేస్తామని జిల్లా కార్యదర్శి లింగాల నరసింహులు డిమాండ్ చేశారు.







