నర్మెట్టకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగుల వెలంగిని, సమాజంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర మహానీయుల ఉత్సవాల కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర మహానీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ డా. అల్లిబిల్లి మహేందర్ ఈ అవార్డును ప్రకటించారు. గత అనేక సంవత్సరాలుగా పేదలు, నిస్సహాయులు, అనాథలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, దళితుల హక్కుల కోసం, విద్య కోసం, మహనీయుల ఆశయాల సాధన కోసం, సామాజిక చైతన్యం కోసం ఏనుగుల వెలంగిని చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ అవార్డు ప్రధానోత్సవం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగింది. ఉత్సవాల కమిటీ చైర్మన్ అలిబిల్లి మహేందర్ చేతుల మీదుగా అవార్డును వెలంగినికి అందజేశారు.
అవార్డు అందుకున్న అనంతరం ఏనుగుల వెలంగిని మాట్లాడుతూ, 'నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఈ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచింది. సమాజ సేవలో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తాను. ఈ గుర్తింపు నా సేవా ప్రయాణానికి మరింత స్ఫూర్తిని ఇస్తుంది' అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏనుగుల వెలంగినికి అభినందనలు తెలియజేశారు.








