జనగామ, 2026-06-05
జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి తీరుపై గండి రామవరం గ్రామ సర్పంచ్ చెవుల కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సమస్యపై చర్చించడానికి వెళ్లిన తనను, వార్డు సభ్యులను మేనేజర్ నిలబెట్టి మాట్లాడటం, కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.
గండి రామవరం గ్రామ సర్పంచ్ చెవుల కుమార్ యాదవ్, వార్డు సభ్యులు బోడిక వినోద్ కుమార్ లు జనగామ డిపో మేనేజర్ స్వాతి ని కలవడానికి వెళ్లారు. బస్సు సమస్యపై వివరించే క్రమంలో తమను నిల్చోబెట్టి మాట్లాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
నిరీక్షణ, అవమానం
గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మధ్యాహ్నం 2 గంటలకు డిపో మేనేజర్ ను కలవడానికి వెళ్లగా, ఆమె 4:30 గంటలకు వస్తానని తెలిపారు. అప్పటివరకు వేచి చూసిన అనంతరం మేనేజర్ రాగానే వారిని కలిశారు. బస్సు సమస్యను వివరిస్తున్న సమయంలో, కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ కనీసం కూర్చోమని చెప్పకుండా సుమారు 20 నిమిషాల పాటు నిలబెట్టి మాట్లాడటం సరికాదని సర్పంచ్ కుమార్ యాదవ్ అన్నారు.
ప్రజాప్రతినిధులతోనే ఇలానా
ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెళ్లినప్పుడు డిపో మేనేజర్ స్వాతి కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదని, దీనిపై డిపో మేనేజర్ తో పాటు పై అధికారులు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతోనే ఇలా ప్రవర్తిస్తే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
గ్రామస్తుల సహకారం
గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని మేనేజర్, బస్సు డ్రైవర్ సూచించడంతో, గ్రామస్తులు కలిసి సుమారు 20 వేల రూపాయలు ఖర్చు చేసి వాటిని తొలగించారని తెలిపారు. తాము కలవడానికి వెళ్లినప్పుడు మేనేజర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జీనుక ఉప్పలయ్య, శోభ కుమార్, కంబాల రవి, గ్రామస్తులు బోడిక లక్ష్మయ్య, తుప్పుడు బిక్షపతి, వడ్లురి సునీల్ తదితరులు పాల్గొన్నారు.










