Hanamkonda, 2026-11-25
రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు పాల్పడుతున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన జన చైతన్య సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైందని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. రాజకీయంగా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
హనుమకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయంగా అణచివేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.
సభ విజయవంతం కావడంతో అక్కస్సుతో దాడులకు పాల్పడుతున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరిని ఉసిగొల్పి దాడులకు పాల్పడటం సరైన విధానం కాదన్నారు.
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని, రౌడీయిజం, బెదిరింపులతో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాకపోతే చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తమకు సవాల్ విసిరిన నాయకులు నిజంగా ప్రజలపై, తమ అభివృద్ధి పై, పార్టీ పై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై జరిగిన దాడిని నగర ప్రజలే కాకుండా జిల్లా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను విద్యార్థులు, మహిళలు సహా ఏ వర్గం ప్రజలు కూడా హర్షించరని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధి పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కాళోజీ కళాక్షేత్రం, నాయినినగర్ బ్రిడ్జి, తాజ్పేట ఫ్లైఓవర్ వంటి కీలక అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని పేర్కొన్నారు. దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను ప్రారంభించి, వాటిని తమ ప్రభుత్వ అభివృద్ధిగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.







