జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భద్రతా సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కుల్గామ్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు సుమారు మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో నాకా వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని అనంతనాగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దాడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. భద్రతా బలగాలు అప్రమత్తమై, అనుమానితుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి.





