దేశ భవిష్యత్ అయిన యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా చూడాలని, గంజాయి విక్రయించే మూలాలపై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. నేర సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి మత్తు నుండి యువతను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, గంజాయి విక్రయించే మూలాలపై దృష్టి సారించి, వాటిని నిర్మూలించాలని ఆదేశించారు.
సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, శివారు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.
చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎం.జి.ఎం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలోని సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.
గంజాయి విక్రయించే వారిని గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక రవాణా, రేషన్ బియ్యం అక్రమ రవాణాలపై కూడా కఠినంగా వ్యవహరించాలని, ఆలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.





