చేపడుతున్నట్లు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
సిద్దిపేట జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 202627కు సంబంధించి 424 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ తెలిపారు. సన్న రకం ధాన్యం విక్రయించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తామని వెల్లడించారు.
సిద్దిపేట: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 202627కు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మొత్తం 424 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా, నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులను అందుబాటులో ఉంచడంతోపాటు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులు, గోదాములకు తరలించేందుకు సరిపడా లారీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేటాయించిన మిల్లులు, గోదాముల్లో ధాన్యం దిగుమతికి ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే కొనుగోళ్లు జరిగేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం ఏడు రకాల సన్న రకం ధాన్యాన్ని విక్రయించే రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.
జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, కొనుగోలు కేంద్రాల పనితీరు, గన్నీ సంచుల లభ్యత, ధాన్యం రవాణా, మిల్లుల్లో దిగుమతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు.







