బచ్చన్నపేట్, 10 November
ఆర్థిక సాయం, ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త స్వర్గీయ లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం కొన్నే గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ మృతి బాధాకరమన్నారు. జేసీబీ సీజ్ కావడం, పంట నష్టాలు, భూమి ప్రొహిబిషన్ జాబితాలో చేరడం వంటి కారణాలతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించామని, లక్ష్మణ్ గౌడ్ భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. కుటుంబం ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపై ఉన్న సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఎన్కంబరెన్స్ సర్వే నిర్వహించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.






