బచ్చన్నపేట్, 10 November
ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు భరోసా ఇచ్చారు. ఆయన భార్యకు ఉద్యోగం కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. మంగళవారం జనగామ జిల్లా మండలం కొన్నే గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, లక్ష్మణ్ గౌడ్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. జేసీబీ సీజ్ కావడం, భారీ పెనాల్టీలు, అప్పుల భారం, పంట నష్టం, భూమి ప్రొహిబిషన్ జాబితాలో చేరడం వంటి సమస్యలతో లక్ష్మణ్ గౌడ్ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కుటుంబ సభ్యులు తమకు వివరించినట్లు చెప్పారు. సొంత భూమితో పాటు కౌలుకు తీసుకున్న భూమిలో సాగు చేసిన పంటకు నీరు, విద్యుత్ అందక నష్టపోయారని తెలిపారు. భూమి వివాదం కారణంగా దానిని విక్రయించి అప్పులు తీర్చుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కుటుంబానికి ఆర్థిక సహాయం అందించామని, లక్ష్మణ్ గౌడ్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరుడికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆయన భార్యకు మంచి ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఒక ఉద్యమకారుడి కుటుంబాన్ని కాపాడుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. వ్యక్తి మృతిని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని విమర్శించారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఉద్యమకారుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబం ఏళ్ల తరబడి అనుభవిస్తున్న భూమి విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించాలని పల్లా కోరారు. క్షేత్రస్థాయిలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి, భూమి వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతంలో విద్యుత్, సాగునీటి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబానికి సహాయం చేయకుండా విమర్శలు చేయడం సరికాదని, ఎన్ని విమర్శలు ఎదురైనా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






